ఇటీవల జరిగిన ఆర్టికల్ 370,35-A రద్దు తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జమ్మూకశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్, లద్దాఖ్ సోదరులకు జరిగిన అన్యాయంపై ఇంతకాలం చర్చ జరగలేదన్నారు.. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ఎందరో మహనీయుల స్వప్నం సాకారమైందని మోదీ అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందని, ఒకటే భారత్, ఒకటే రాజ్యాంగం అనే స్వప్నం ఫలించిందని చెప్పారు. జమ్మూకశ్మీర్,లడక్ ప్రజలకు తన అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.ఆర్టికల్ 370, 35-ఏ వల్ల కశ్మీర్ లో ఉగ్రవాదం పెరడగం తప్ప, అక్కడి ప్రజలకు ఏమీ జరగలేదని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఆర్టికల్ 370, 35-A వల్ల కశ్మీర్లో కుటుంబ వాదం, ఉగ్రవాదం తప్ప సాధించిందేమీ లేదని, ‘370’ని పాకిస్థాన్ ఆయుధంలా వాడుకుందని అన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా జమ్ముకశ్మీర్ వెనుకబడిందని, కశ్మీర్‌ను రక్షించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పటి వరకూ ప్రజలకు ఉపయోగపడే ఏ చట్టమూ అక్కడ అమలు కాలేదని,అక్కడి పిల్లలకు విద్య అందలేదని మోదీ అన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్ అద్భుత పరిపాలన అందిస్తున్నారు’’ అని మోదీ కొనియాడారు.
కశ్మీర్లో కేంద్ర పాలన తాత్కాలికమేనని, అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక ఆ పాలన ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ పోలీసులకు కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇకపై కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.జమ్ముకశ్మీర్ లో ఇన్నాళ్లూ, విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైనా కశ్మీర్లో అమలు కాలేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం,మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నా,ఇక్కడ మాత్రం లేవని,అదే విధంగా కనీసవేతన చట్టం కూడా ఇక్కడ లేదని గుర్తుచేశారు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని,దేశ అభ్యున్నతి కోసం చేసే చట్టాలు ఇకపై జమ్ముకశ్మీర్‌లో కూడా వర్తిస్తాయని మోదీ పేర్కొన్నారు.