ఐదో విడత హరితహారంపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

440
sk joshi
- Advertisement -

ఐదో విడత హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సచివాలయ ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నందున తెలంగాణకు హరితహారం ముమ్మరంగా కొనసాగేలా చూడాలని చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తగిన ఎత్తులో ఉన్న మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు, నీటి వసతి కల్పనకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.

మొక్కలు నాటడంలో సంఖ్య కన్నా, వాటిని బతికించే శాతం పెంపుపైన ప్రధానంగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని చీఫ్ సెక్రటరీ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న మొక్కలు నాటొద్దని, తగిన ఎత్తులో ఉన్న మొక్కలు నాటితేనే బతికేశాతం ఆ మేరకు పెరుగుతుందని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సూచించారు.

మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వెనువెంటనే జరిగితే, వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తెలిపారు. నాలుగు విడతల తర్వాత తెలంగాణకు హరితహారం ఫలితాలపై జనంలో మంచి స్పందన కనిపిస్తోందని, రాష్ట్రాన్ని పచ్చదనం చేసే ఈ ప్రక్రియ కొనసాగాలని, అన్ని శాఖల మధ్య సమన్వయంతో పాటు, ఆయా శాఖలు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా వారే పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) పీకే ఝా అన్నారు.

మొక్కలు నాటే ప్రాంతాలను తప్పనిసరిగా జీయో ట్యాగింగ్ చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో మండలాలు, గ్రామ స్థాయి వరకు కొత్త ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి గ్రామీణాభివృద్ది శాఖ హరితహారం అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పంచాయితీ రాజ్ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది అకింతభావంతో పనిచేయటం వల్ల జగిత్యాల జిల్లాలో హరితహారం, అడవుల రక్షణ, గ్రామాల వారీగా అవెన్యూ ప్లాంటేషన్ లో మంచి ఫలితాలు సాధిస్తున్నామని కలెక్టర్ శరత్ సమావేశంలో వెల్లడించారు.

అలాగే కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద హరితహారం కోసం ఏడు కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకున్న మేడ్చెల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ. రెడ్డిని అధికారులు అభినందించారు. అన్ని జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, పరిశ్రమలు హరితహారంలో తమవంతు పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు సూచించారు. మొక్కల రక్షణ కోసం ఉపాధి హామీ నిధులతో అనుసంధానం చేసి వాచర్లను నియమించాలని సూచించారు.

క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో అధికశాతం తెలంగాణ ప్రాంత భూములు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదిగే మొక్కలనే నాటాలని తెలిపారు. ఆలస్యంగానైనా మంచి వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, విభిన్న వర్గాలు తెలంగాణకు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ కోరారు. ఈ నెల 31న (బుధవారం) పదవీ విరమణ చేస్తున్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝాను చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, కలెక్టర్లు సమావేశంలో అభినందించారు. గత మూడేళ్లుగా తెలంగాణలో అటవీ సంరక్షణ కోసం ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని అందరూ చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -