ఎటు చూసిన ఎత్తైన పచ్చని చెట్లు, కొండలు, చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత కొండలపై నుంచి జాలువారే సెలయేళ్లు కనువిందు చేస్తాయి. ఆకాశమంత ఎత్తు నుంచి పాలధారలుగా నీళ్లు జాలువారుతుంటాయి. ఆ అందమైన దృశ్యాలను చూస్తూ రెప్ప వాల్చడం ఎవరితరం కాదు. ఇక్కడ తెల్లని పాలదారళ్లా ఉప్పొంగుతున్న జలపాతం బొగత జలపాతం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అడవిలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సవ్వళ్లు షురూ అయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ర్టంలోని జలపాతాలకు వరద పోటెత్తింది. ప్రకృతి పులకింతల మధ్య ఈ జలపాత హోయలను ఆస్వాదించొచ్చు. ప్రకృతి సౌందరాన్ని చూసి పరవశించొచ్చు. ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది.
ప్రకృతి సష్టించిన అద్భుతమైన అందాల్లో ఈ జలపాతం ఒకటి. బొగత జలపాతం అందాలను వీక్షించేదుకు వచ్చే పర్యాటకులకు ఈ సారి బొగత జలపాతం కొత్త అందాలతో స్వాగతం పలకనుంది. పర్యాటకుల సౌకర్యార్దం బొగత వద్ద రోప్‌వే, సైక్లింగ్, చిల్డ్రన్స్ పార్క్, బటర్ ప్లై పార్క్, స్విమ్మింగ్ ఫూల్, అడవి అందాలను చురగొనే పగోడాలు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. మరికొద్ది రోజుల్లో బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తగా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.