పెద్ద నోట్లు రద్దు చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడంపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మోడీ నిర్ణయం సాహసోపేతమైందన్నాడు తమిళ నటుడు విజయ్. అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ నిర్ణయంతో సామాన్యులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపాడు.
దేశంలో 20% మంది ధనవంతులు ఉన్నారు. వారిలో కొందరు చేసే తప్పుల వల్లే 80% మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నతస్థాయిని సాధిస్తుందని నమ్ముతున్నా. అయితే ప్రజలు డబ్బు మార్చుకోవడం కోసం సమస్యలు ఎదుర్కోవడాన్ని చూస్తే కాస్త ఆవేదనగా ఉంది. ఓ వృద్ధురాలు తన మనవరాలి పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకుందని విన్నా. అలాగే ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స చేయలేక తల్లి బాధపడిందని తెలిసింది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని తెలిపాడు.