మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ఇవాళ దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చిరంజీవి అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. ఈ నేపథ్యలో మెగాస్టార్ మూవీని ఫస్ట్ షో చూడాలని ఉత్సహం ప్రతీ అభిమానికీ ఉండటం సహజం. అలాగే చిరు సినిమా మొదటి షో చూడాలని సగటు అభిమానిలాగే ఒ ఆరుగురు ఎస్‌ఐలు సినిమాకు వెళ్లారు. దాంతో ఎస్‌ఐలకు జిల్లా ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చారు.
అసలు విషయం ఏంటంటే.. కర్నూల్ జిల్లాలోని కోవెలకుంట్లలో సైరా నరసింహారెడ్డి బెనిఫిట్ షోకు ఆ ఎస్‌ఐలు వెళ్లారు.వారు సినిమాకు వెళ్లడం తప్పేమి కాదు. కాకపోతే వారు విధుల్లో ఉండగా ఈ పని చేయడం జిల్లా ఎస్పీకి ఆగ్రహం తెప్పించింది. ఎస్‌ఐల తీరుపై ఎస్పీ పకీరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున వీఆర్‌కు పంపాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఉండగా సినిమా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ ఎస్ఐలపై బదిలీ వేటు వేశారు.
ఇక స్వాతంత్య్ర పోరాట కాలంనాటి యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ‘సైరా’ చిత్రంపై ముందు నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదల చేయడం విశేషం.