ఎన్డీయేకు 400 సీట్లు పక్కా : మోడీ!

23
- Advertisement -

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయంపై ఎన్డీయే కూటమి గట్టిగా గురిపెట్టింది. ఈసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది. గతంలో మాదిరి ఈసారి కూడా మోడీ మేనియాతోనే గట్టెక్కాలని భావిస్తోంది. ఇకపోతే ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాల కోసం కమలనాథులు ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఏకంగా 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే బీజేపీ నిర్వహిస్తున్న ప్రతి సభలోనే ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇటీవల డిల్లీలో రెండు రోజులపాటు నిర్వహించిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న మోడీ రాబోయే ఎన్నికల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 100 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఈ వంద రోజులు అత్యంత ముఖ్యమైనవని చెప్పుకొచ్చారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..

అంతే కాకుండా ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు గ్యారెంటీ అని, ఆ విషయాన్ని విపక్షాలే చెబుతున్నాయని మోడీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే ఎన్డీయేకు పోటీనిచ్చే ఇండియా కూటమి బలహీన పడుతుండడంతో మోడీ చెప్పినట్లుగా ఎన్డీయేకు 400 సీట్లు వచ్చిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. ఆ దిశగానే బీజేపీ వ్యూహారచన చేస్తోంది కూడా. సీట్ల కేటాయింపులోనూ, ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచడంలోనూ స్పెషల్ ఫోకస్ కనబరుస్తోంది. మరి కాషాయ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందేమో చూడాలి. కాగా కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి వస్తే నియంత అవుతారని, ఆయన పాలనలో అరాచకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంతకీ మోడీ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Also Read:మడత పెట్టేదెవరు.. జగనా ? చంద్రబాబా ?

- Advertisement -