ఆర్టీసీలో మరో 38 మందికి ఉద్యోగాలు…

563
sunil sharma
- Advertisement -

ప్ర‌త్యేక ఉద్యోగ క‌ల్ప‌నలో టీఎస్ ఆర్టీసీలో ఎంపికైన ఉద్యోగ‌స్థుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణా త‌ర‌గ‌తుల్ని ప్రారంభించారు ఎండీ సునీల్ శర్మ. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ అజయ్ చొరవతో సమ్మెకాలంలో మరణించిన 38 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఉద్యోగ కల్పన పథకం ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.

ఈ సందర్భంగా మాట్లాడిన సునీల్ శర్మ కొత్త‌గా సంస్థ‌లో చేరిన వారంతా శిక్ష‌ణా కాలంలో విష‌యాల‌న్నీ చ‌క్క‌గా నేర్చుకుని త‌ర్వాత వారి విధి నిర్వ‌హ‌ణ‌లో చ‌క్క‌గా ప‌ని చేసి, మంచి ఫ‌లితాలు తేవాల‌ని కోరారు. అంద‌రికీ చక్క‌టి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, వ‌చ్చే సంవ‌త్స‌రం నాటికి అంద‌రూ ఉద్యోగులు బోన‌స్ తీసుకునే స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.

ఉద్యోగంలో చేరిన 38 మందిలో 16 మంది జూనియ‌ర్ అసిస్టెంట్ (ప‌ర్స‌న‌ల్‌), 12 మంది కండ‌క్ట‌ర్లు, 8 మంది సెక్యూరిటీ కానిస్టేబుల్స్ మ‌రియు ఇద్ద‌రు శ్రామికులు ఉన్నారు. జూనియ‌ర్ అసిస్టెంట్స్‌కు 13 వారాలు, కండ‌క్ట‌ర్ల‌కు 3 వారాలు, సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కు 8 వారాలు మ‌రియు శ్రామికుల‌కు 2 వారాల పాటు హాకింపేట‌లోని టి.ఎస్‌.ఆర్టీసీ శిక్ష‌ణా క‌ళాశాల‌లు ట్రాన్స్పోర్ట్‌ అకాడ‌మీ మ‌రియు జెడ్‌.ఎస్‌.టి.సి ల‌లో శిక్ష‌ణ‌ను ఇస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉద్యోగాలు పొందిన వారు మాట్లాడుతూ పెద్ద దిక్కు కోల్పోయిన త‌మ కుటుంబాల‌లో మ‌ళ్లీ టి.ఎస్‌.ఆర్టీసీలో ఉద్యోగ‌మిచ్చి ఆదుకున్న‌ సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -