మహిళా హక్కులకు మరింత వత్తాసు లభించింది. ట్రిపుల్ తలాక్ కు కేంద్రం చెల్లు చీటీ రాసింది. తలాక్..తలాక్..తలాక్ పేరుతో విడాకులు ఇవ్వడం శిక్షార్హమని పేర్కొంటున్న బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌ను దుర్వినియోగపరుస్తున్న భర్తల నుంచి ఇకపై భార్యలకు పూర్తిస్ధాయి రక్షణ లభించనుంది.
ఈ ఏడాది ఆగస్టులో మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే పద్ధతిని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ అనేక రూపాల్లో ఈ పద్ధతి ఇంకా కొనసాగుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ”తలాక్ తలాక్ తలాక్’ అని మొబైల్ ద్వారా మెస్సేజ్ పంపి అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో అధ్యాపకునిగా పనిచేస్తున్న తన భర్త విడాకులు కోరినట్లు ఓ మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో దీన్ని శాశ్వతంగా రద్దు చేసేందుకు కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చింది.
ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2017కు పార్లమెంటు ఆమోదం లభిస్తే తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి, విడాకులు ఇచ్చే పురుషునికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. బాధిత మహిళ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించేందుకు, మాజీ భర్త నుంచి పోషణ భత్యాన్ని కోరేందుకు అవకాశం ఏర్పడుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్ నేరం అని చెప్తున్న ఈ బిల్లు ఆమోదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింలలో చాలా మంది దీనిపై చర్చ జరగాలని కోరుతున్నారు.