35 ఏండ్ల వ్యక్తి పొట్టలో భారీగా ఇనుప వస్తువులు, నాణేలు ఉండటాన్ని చూసి డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. మక్సుద్‌ఖాన్ అనే వ్యక్తి కడుపునొప్పితో మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో ఉన్న సంజయ్‌గాంధీ హాస్పిటల్‌లో చేరాడు. నొప్పికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు. కడుపులో వందల కొద్దీ నాణేలు, మేకులు, గాజు ముక్కలు, రాళ్లు, షేవింగ్ బ్లేడ్లు ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరకు శస్త్రచికిత్స నిర్వహించి మొత్తం ఏడు కిలోల బరువైన వస్తువులను బయటకు తీశారు.
అయితే వాటిలో 263 నాణేలు, 100 ఇనుప మేకులు ఉన్నాయి. ఖాన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఇనుప వస్తువులు, నాణేలు తినే అలవాటు గురించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అతను చెప్పలేదని వైద్యులు వెల్లడించారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఖాన్.. వినియోగదారులు ఇచ్చే నాణేలను తినేవాడని చెప్పారు. మూడునెలలుగా అతడు కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పారు.
అతనికి ఎప్పుడైనా నాణేలు, ఇనుప వస్తువులు మింగాలనిపించినప్పుడు ఎవరికీ తెలియకుండా నీళ్లతో కలిపి తీసుకునేవాడని, మానసిక సమస్యల వల్లే ఈ అలవాటు ఏర్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆశ్చర్యకరంగా నాణేలు, మేకులు కడపులో ఉన్నా మొదట్లో అతనికి ఎటువంటి సమస్య రాలేదని, ఇలాంటి కేసును చూడటం తమ వృత్తి జీవితంలో ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌కు ఎటువంటి ప్రమాదం లేదని, మరోసారి ఇలాంటిది జరిగితే ప్రమాదం తప్పదని పేర్కొన్నారు.