తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 పట్టణాభివృద్ధి సంస్థలు

215
- Advertisement -

ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత దగ్గరగా చేసే యోచనతో కొత్త జిల్లాలను ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం ఇక పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక సంస్థల ఏర్పాటుకు పురపాలక శాఖ కసరత్తును వేగవంతం చేసింది. పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరుచడంతోపాటు నిధులను కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ అంశానికున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం కోరింది.

online news portal

రాష్ట్రంలో ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలోనే వివిధ పట్టణాభివృద్ధి సంస్థలు పనిచేస్తుండంతో, కొత్తగా మరో 24 డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి, హైదరాబాద్, యాదాద్రి, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో హుడా, కుడా, యాదాద్రి వంటి పట్టణాభివృద్ధి సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రతి జిల్లాకో పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచన ప్రకారం మిగిలిన 24 జిల్లాల్లోనూ ఆ ప్రక్రియను మొదలుపెట్టాల్సి ఉంది.

online news portal

ముందుగా జిల్లా కేంద్రంలో అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి ఆ తరువాత జిల్లాలోని ఇతర పట్టణాల వైపు దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థల తీరు తెన్నులు ఎలా ఉండాలో తెలియజేయాలంటూ పురపాలక శాఖ 24 జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపించింది. దీనికి 15 జిల్లాల కలెక్టర్లు స్పందించి తమ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వనికి పంపినట్టు సమాచారం. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాలతోపాటు రామగుండం వంటి పట్టణంలో పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సంబంధించి తుది ప్రణాళికలు పురపాలక శాఖకు చేరాయని తెలిసింది. వికారాబాద్, నాగర్‌కర్నూలు, నిజామాబాద్, సిద్దిపేట, ఖమ్మం, జగిత్యాల, జనగామ, నిర్మల్, ఆదిలాబాద్, జోగుళాంబ-గద్వాల్ జిల్లాల కలెక్టర్ల నుంచి ఇంకా సమాచారం రాలేదని తెలిసింది. అంతా సవ్యంగా సాగితే, వచ్చే వారంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పురపాలక శాఖకు చేరే అవకాశమున్నది.

online news portal

ప్రతి జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటైతే.. జిల్లా కేంద్రంతో బాటు దాని చుట్టుపక్కల గల గ్రామాల్లో అత్యున్నత స్థాయిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. 1975 తెలంగాణ పట్టణాభివృద్ధి సంస్థల అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం ఏర్పాటయ్యే పట్టణాభివృద్ధి సంస్థకు చైర్మన్, వైస్ చైర్మన్‌లను ప్రభుత్వం నియమిస్తుంది. వైస్ చైర్మన్ పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆయా జిల్లా పరిధిలోకి వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేలను, మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకు ఎన్నికైన ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరికి అదనంగా జీహెచ్‌ఎంసీ లేదా పురపాలక శాఖకు చెందిన అధికారి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆర్థిక విభాగం నుంచి ఓ అధికారి, వీరు కాకుండా మరో ఇద్దరిని ప్రభుత్వం నియమిస్తుంది.

- Advertisement -