డిజిటల్ పరిజ్ఞాన వినియోగంలో ముందంజలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలె తన పేరుతో ‘నరేంద్ర మోడీ మొబైల్ యాప్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ప్రధాని నుంచి నేరుగా సందేశాలు, ఈ మెయిళ్ళు అందుకోవచ్చన్న మాట. అంతేకాదు.. ఆయనతో మన సలాహాలు, సూచనలను పంచుకోనూ వచ్చు ! ఎప్పటిలాగానే ఆయన ఈ విషయాన్నీ కూడా ట్విట్టర్లో చాటారు. అయితే, ఇప్పుడు ఈ యాప్‌ను హ్యాక్ చేసి సంచలనం సృష్టించాడు 22 ఏళ్ల కుర్రాడు.
నోట్లరద్దుపై అభిప్రాయాలు తెలిపేందుకు నరేంద్రమోదీ యాప్..ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అందులో 10 ప్రశ్నలపై మీ అభిప్రాయాలు చెప్పాలని ఆయనే ప్రకటించారు. ఆయన ప్రకటించిన తర్వాత కేంద్రమంత్రులు, ఎంపీలు, అధికారుల నుంచి ప్రజల వరకు కోట్లాది మంది ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని నోట్లరద్దుపై తమ అభిప్రాయాలు చెప్పారు. అందులోనే సలహాలు సూచనలు ఇచ్చారు.
అయితే, ఈ యాప్‌ను డిసెంబర్ 1న 22ఏళ్ల కుర్రాడు జవేద్ ఖత్రి హ్యాక్ చేసి..దేశంలో స్మార్ట్ ఫోన్లు, క్యాష్ లెస్ లావాదేవీలపై మన ప్రభుత్వం భద్రత ఏమాత్రం పాటిస్తుందో…సవాల్ విసురుతూ ప్రత్యక్షంగా చూపించాడు. జావేద్ ఖత్రి…నరేంద్ర మోడీ యాప్ ను హ్యాక్ చేసిన విషయాన్ని యువర్ స్టోరీ వెబ్ సైట్ కిచ్చిన ఆన్ లైన్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆ యాప్ లో నమోదు చేసుకున్న వారి వ్యక్తిగత డాటాను నేను (యాక్సెస్) తెలుసుకోగలిగాను. హ్యాక్ చేసిన డాటాలో పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, ప్రాంతం (లోకేషన్) వంటి వివరాలున్నాయి. ఇందులో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ వంటి వారి వ్యక్తిగత వివరాలు కూడా సంపాదించడంలో విజయం సాధించాను అని తెలిపాడు.
ఒకవైపు ప్రజలంతా నగదు రహిత చెల్లింపులను అలవాటు చేసుకోవాలని, లావాదేవిలన్నీ టెక్నాలజీ సాయంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా జరుగుతాయని..అది అత్యంత భద్రంగా ఉంటుందని అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతుంటే…ఆయనకు చెందిన మొబైల్ యాప్ (అప్లికేషన్) హ్యాక్‌కు గురికావడం ఆందోళన కల్గిస్తోంది. యాప్‌లు, స్మార్ట్ ఫోన్ల భద్రతా లోపాలును ఎత్తిచూపేందుకు మాత్రమే తాను పీఎం యాప్ ను హ్యాక్ చేసినట్లు ఖత్రి వెల్లడించాడు.
పీఎం యాప్ హ్యాక్‌కు గురికావడంపై బీజేపీ సాంకేతిక, సమాచార విభాగం స్పందించింది. యాప్ రూపకల్పనకు ఎంతో భద్రతాపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ హ్యాక్ గురైందని పార్టీ ఐటీ విభాగం నేతలు వ్యాఖ్యానించారు. మోడీ యాప్ హ్యాక్ కావటం పెద్ద చర్చనీయాంశమైంది.