ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొదటి మహిళ డ్రైవర్ గా తెలంగాణ నల్గొండ జిల్లా కు చెందిన సరితను నియమించిన సంగతి తెలిసిందే. కొద్ది కాలంగా ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)లో సేవలందిస్తున్న సరిత తెలంగాణకు వస్తానంటోంది. నల్లగొండ జిల్లా సంస్థాన నారాయణ్‌పూర్ వాసి అయిన సరిత ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా అవకాశమివ్వాలని సరిత మంత్రి మహేందర్‌రెడ్డిని కోరారు. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని మంత్రిని సరిత కోరారు. సరిత విజ్ఞప్తికి మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే తెలంగాణలో స్టీరింగ్ పట్టిన తొలి మహిళా డ్రైవర్‌గా సరిత నిలవనుంది.
ఇప్పటి వరకు మహిళలు ఆటోలు, క్యాబ్లు డ్రైవింగ్ చేయడం మనకు తెలుసు. మొట్టమొదటి సారిగా ప్రభుత్వ రవాణా శాఖలో ఒక మహిళను బస్సు డ్రైవర్‌గా నియమించడం తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి ఆమెను అబ్బాయిలా పెంచారు తల్లిదండ్రులు.అంతే కాదు సరిత చిన్న నాటి నుంచి తన హెయిర్ స్టయిల్, తన డ్రెస్సింగ్ స్టయిల్ మగవారిలా మెయిటేయిన్ చేసేదట.
నాన్న ఇష్టంతో అంటున్న సరిత మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని చాలా ఆత్మ విశ్వాసంతో చెబుతోంది. ఢిల్లీలో బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్ లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవంతో ఉద్యోగం సంపాదించింది. 2015లో డీటీసీలో ఉద్యోగం సంపాదించి సరోజిని నగర్ డిపోలో తొలి పోస్టింగ్ పొందింది సరిత.
డ్రైవింగ్ లో సరితకు శిక్షణ ఇచ్చిన పర్వేష్ శర్మ అయితే ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి ముచ్చటపడ్డారట. భవిష్యత్తుల్లో చాలా మంచి డ్రైవర్ అవుతుందంటూ కితాబులిచ్చారు. మొదట్లో మహిళలకు ట్రైనింగ్ అంటే కొంచెం భయపడ్డా…ఢిల్లీలాంటి నగరాల్లో డ్రైవింగ్ వారి వల్ల కానే కాదు అనుకున్నా…కానీ సరిత చాలా తొందరగా నేర్చుకున్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. తమ నిర్ణయం మరింతమంది మహిళలను డ్రైవింగ్ వృత్తిలోకి రావడానికి ఉత్సాహపరుస్తుందని … కొత్త రంగాల్లో మహిళలను ఎంకరేజ్ చేయడంలో తమ ప్రభుత్వం ముందుంటుందనీ, ఇది ప్రారంభం మాత్రమేనని ఢిల్లీ రవాణామంత్రి గోపాల్ రాయ్ తెలిపిన సంగతి తెలిసిందే.