గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. గతంలో నయీమ్ అక్రమంగా చేసుకున్న పలు ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ఈరోజు నల్గొండలోని ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీమ్ లాక్కున్న అంశంపై వారు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా తమ భూములు నయీమ్ అక్రమంగా లాక్కున్నాడని సుమారు 1700 మంది బాధితులు ఆర్డీవో ఆఫీసుకి చేరుకున్నారు. వారి ప్లాట్లకు సంబంధించిన పలు పత్రాలను తమతో తీసుకువచ్చి మీడియాకు కూడా చూపించారు. తమను నయీమ్ అనుచరులు భయపెట్టారని వారు మీడియాతో అన్నారు. తమ ప్లాట్లను తమకు అప్పగించాల్సిందిగా వేడుకున్నారు.
నయీమ్‌పై ఇప్పటివరకు 62 కేసులు నమోదైనట్లు సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి వెల్లడించారు. ఈ కేసుల్లో ఇప్పటికే 53 మందిని అరెస్టు చేయగా.. శుక్రవారం ఒక్క రోజే పది మందిని అరెస్టు చేశారు. వీరిని కోరుట్ల, భువనగిరి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు వీరంతా సన్నిహితులని సిట్ పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో ఆసిఫ్‌ఖాన్, చిన్నబత్తిని బెంజమిన్, కాసాని ఇంద్రసేనా, గుమ్మడెల్లి మల్లేశ్, కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేశ్, గడ్డం జంగయ్య, రాకాల శ్రీనివాస్, సందెల ప్రవీణ్‌కుమార్, మహ్మద్ యూనస్‌లను అరెస్టు చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్‌లు, ఆయుధాలతో బెదిరించి బలవంతపు వసూళ్లు, భూ రిజిస్ట్రేషన్లు తదితర నేరాలకు సంబంధించి వీరిపై ఏడు కేసులు నమోదయ్యాయి.
పుణెలో పట్టుబడిన గ్యాంగ్‌స్టర్ నయీం ముఖ్య అనుచరుడు ఆసిఫ్‌ఖాన్ అలియాస్ హన్సిక్‌ఖాన్‌ను కరీంనగర్ జిల్లా పోలీసులు శుక్రవారం కోరుట్ల మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను వెల్లడించిన విషయాలతో మరికొందరి అరెస్టులకు సిట్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు పీడీ యాక్ట్ నమోదుతో వరంగల్ జైలులో ఉన్న పాశం శ్రీనును ఆగస్టు 31న సిట్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియనుండగా.. పాశం శ్రీను నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. నయీమ్ గ్యాంగ్ కిడ్నాప్‌లు, బెదిరింపులతో భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో పాల్గొన్న నిందితులు, బాధితుల వివరాలను శ్రీను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అక్రమ దందాల్లో తనతోపాటు పాల్గొన్న వారి పేర్లను శ్రీను బహిర్గతం చేయడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు శ్రీను కస్టడీని పొడిగించేలా కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.