ఈరోజు సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.ఇందలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధిపై హాలియా మార్కెట్‌యార్డులో ప్రగతి సమీక్ష సమావేశంలో నిర్వహించారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని స్పష్టం చేశారు.సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారి కారణంగా సాగర్‌కు రావడం ఆలస్యమైందన్నారు.తనను కూడా కరోనా విడిచిపెట్టలేదు.ఎన్నికలు అయిపోగానే ఇక్కడకు రాలేకపోయాను. సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి.. వాటన్నింటిని క్రమక్రమంగా పూర్తి చేసుకుందాం అని కేసీఆర్ అన్నారు.
‘ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేస్తాం. బంజారాల కోసం బంజారా భవనం నిర్మాస్తాం.దళితబంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం.24 గంటల విద్యుత్ ఇస్తామంటే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారు.రెండేళ్లు కాదు ఇరవై ఏళ్లయినా ఇవ్వలేరని జానారెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తే టీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి అన్నారు.రెండేళ్లలో మేం 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం.జానారెడ్డి మాత్రం మొన్న కాంగ్రెస్ కండువా కప్పుకునే పోటీ చేశారు’ అని కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు.