100 రోజుల పాలన.. ఎలా ఉంది?

30
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఈ వందరోజుల్లో కాంగ్రెస్ పాలన తీర్పుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల దృష్టిని ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని కచ్చితంగా అమలు చేస్తామని మొదటి నుంచి కూడా ధీమాగా చెబుతూనే వచ్చింది. చెప్పినట్లుగానే అధికారం చేపట్టగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్య స్త్రీ వంటి హామీలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వందరోజుల్లో మిగిలిన గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని చెబుతూ వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వంద రోజులు పూర్తి చేసుకున్న వేళ ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసిందా అంటే లేదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది.

పథకాలను హడావిడిగా అమలు చేస్తూ వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ విఫలం అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య స్త్రీ పెంపు, రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇచ్చే హామీని పెండింగ్ లోనే ఉంచింది. అయితే ఇప్పటివరకు అమలవుతున్న పథకాలు కూడా అరకొరగానే అమలౌతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. రూ.500 వంటగ్యాస్, 200 ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను పరిమితి మేర మాత్రమే అమలుచేస్తున్నారు.

వైట్ రేషన్ కార్డు ఉండి అర్హులైన వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తున్నాయి. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సొంత జాగా ఉండి, రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రూ.5 లక్షల సాయం అందనుంది. మరి వైట్ రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలా పథకాలు అమలు చేస్తూ వాటికి పరిమితులు విధిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద ఈ వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రతికూలత సానుకూలత కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఏర్పడిందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. మరి ముందు రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:పిక్ టాక్ : ఘాటు ఫోజులతో రచ్చ రచ్చ

- Advertisement -