కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వేలైను నిర్మాణానికి మరో 200 కోట్లు..

457
Singareni CMD N Sridhar
- Advertisement -

కొత్తగూడెం (బి.డి.సి.ఆర్‌.) నుండి సత్తుపల్లి వరకూ నిర్మిస్తున్న రైల్వేలైను పనులకు సింగరేణి సంస్థ తనవంతుగా మరో 200 కోట్ల రూపాయలను రైల్వే శాఖకు చెల్లించింది. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో బుధవారం (మార్చి 11వ తేదీ) ఉదయం రైల్వే జి.ఎం. గజానన్‌ మాల్యాకు సింగరేణి సంస్థ సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ ఈ చెక్కును అందజేశారు. దీనితో సింగరేణి సంస్థ ఇప్పటివరకూ 356 కోట్ల రూపాయలను చెల్లించినట్లయింది.

సత్తుపల్లిలో కొత్త ఓ.సి. గనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో కొత్తగూడెం – సత్తుపల్లి రైల్వే పనులు త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ రైల్వే జి.ఎం. గజానన్‌ మాల్యాను కోరారు. నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయని డిసెంబర్‌ 2020 నాటికి రైల్వే లైన్‌ పూర్తి చేయగలమని రైల్వే అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కొత్తగూడెం – సత్తుపల్లి వరకూ నిర్మించే ఈ 53 కిలోమీటర్ల రైల్వేలైను వలన సింగరేణి సంస్థ సత్తుపల్లిలో నిర్వహిస్తున్న ఓ.సి. గనుల బొగ్గును పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో రైలు మార్గం ద్వారా కొత్తగూడెం (సి.హెచ్‌.పి)కి ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వీలు కలగనుంది.

ప్రస్తుతం సత్తుపల్లి ఓ.సి. గనుల నుండి ఉత్పత్తి అయ్యే బొగ్గును 70 కిలోమీటర్ల దూరంలో గల రుద్రంపూర్‌ (కొత్తగూడెం) సి.హెచ్‌.పి.కి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకి సుమారు 16 వేల టన్నుల బొగ్గు ఈ విధంగా రవాణా అవుతుంది. క్రిష్టారం ఓ.సి. గని నుండి పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగితే రోజువారీగా కనీసం 27 వేల టన్నుల నుండి 30 వేల టన్నుల బొగ్గు రవాణా జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో పర్యావరణహితంగా బొగ్గు రవాణా జరపడం కోసం ఈ రైల్వే లైనును ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం సింగరేణి రైల్వే శాఖను కోరింది.

ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ రైల్వే లైను నిర్మాణానికి ఒక ఒప్పందం కుదిరింది. మారిన అంచనా వ్యయం ప్రకారం ఈ నిర్మాణానికి మొత్తం మీద 927 కోట్ల రూపాయల వ్యయం అవుతుండగా దీనిలో సింగరేణి సంస్థ 618.55 కోట్ల రూపాయలను దక్షిణ మధ్య రైల్వే వారు 309.30 కోట్ల రూపాయలను భరించాలని ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ తర్వాత భూ సేకరణతో పాటు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకూ సింగరేణి సంస్థ దశల వారీగా 156.38 కోట్ల రూపాయలను చెల్లించింది. మరో 200 కోట్ల రూపాయలను బుధవారం నాడు చెల్లించడం జరిగింది.

భూసేకరణలో సింగరేణి చొరవ ప్రశంసనీయం – డిసెంబర్‌ నెల నాటికి రైల్వే లైను సంసిద్ధం. కొత్తగూడెం – సత్తుపల్లి రైల్వే మార్గ నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయనీ, 2020 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలియజేశారు. రైలు మార్గ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణలో సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ ఎంతగానో సహకరించారనీ, కేవలం 6 నెలల కాలంలో భూసేకరణ గరిష్టంగా పూర్తవడం తమ ప్రాజెక్టుల్లో ఇదే తొలిసారి అని రైల్వే అధికారులు ప్రశంసించారు.

రైలుమార్గాన్ని నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని, నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు తమ తరపున చెల్లింపు జరుపుతామని, నిర్మాణం పూర్తికి ఇతరత్రా కావాల్సిన సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని సంస్థ సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి తరపున ఇంకా ఇ.డి. (కోల్‌ మూమెంట్‌) శ్రీ జె.ఆల్విన్‌, డి.జి.ఎం. (కోల్‌ మార్కెటింగ్‌) శ్రీ మారెపల్లి వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులు ఎ.జి.ఎం. శ్రీ బి.బి.సింగ్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ శ్రీ శివప్రసాద్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ ప్రసాద్‌ చీఫ్‌ ఫ్రైట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ శ్రీ బి.నాగ్యా, సి.ఇ. (కన్‌స్ట్ట్రక్షన్స్‌) శ్రీ ఆర్‌.రమణారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -