రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ అభిమానుల ముందుకు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి దాని మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో స్వాగతం పలికాడు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ధోని చేసిన పోస్టు వైరల్‌గా మారింది. శుక్రవారంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం ముగియడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
ముఖ్యంగా చెన్నై జట్టుకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతు అభిమానులు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కూడా చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీ ధరించి దిగిన ఓ ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది. తన ఇంటి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ జెర్సీ మీద తన పేరుకి బదులుగా `తళ` అని ఉంది. `తళ` అంటే తమిళంలో `నాయకుడు` అని అర్థం.
ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. గత రెండు సీజన్లలో ధోనీ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. 2017 ఐపీఎల్ ఫైనల్లో పుణె… ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2018 ఐపీఎల్ సీజన్ కోసం తమ పాత ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశముంటే.. మాజీ కెప్టెన్ ధోనీని వదులుకునే అవకాశమే లేదని చెన్నై ఫ్రాంఛైజీ ప్రతినిధి జాన్ తెలిపారు.