ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాది పార్టీ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సమాజ్వాది పార్టీలో చీలికకు రంగం సిద్ధమైంది. ఎస్పీ చీఫ్ ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీ అధ్యక్ష పదవికి,మంత్రి పదవికి రాజీనామా చేసి షాకిచ్చారు. శివపాల్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎస్పీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.తండ్రి,బాబాయ్ లతో అఖిలేష్ వివాదం సద్దుమనుగుతుంది అనుకున్న తరుణంలో శివపాల్ నిర్ణయం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
మరోవైపు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్‌కు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి అఖిలేష్ ఇటీవల తప్పించారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ తొలగించిన మంత్రులు,నేతలతో శివపాల్ సమావేశమవుతున్నారు.తన భవిష్యత్ కార్యచరణ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసకుంటున్నారు.
గత నాలుగేళ్లుగా తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని అలిగి ఉన్న సోదరుడు శివపాల్ యాదవ్కు పార్టీ పగ్గాలు అప్పజేప్పడంపై అఖిలేష్ గుర్రుగా ఉన్నారు. మొదట్లో కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించిన శివపాల్ యాదవ్‌ను ఆ శాఖల నుంచి తప్పించడంతో ఎక్కడలేని కోపం వచ్చింది. అది చాలదన్నట్లు తనవాళ్లు అనుకున్న ఇద్దరు మంత్రులను, సీఎస్ను కూడా పంపేయడంతో ఇక ఆయన తాడోపేడో తేల్చుకోవాలన్న దశకు వచ్చేశారు.
తాను తన అన్న చెప్పిందే వింటానని…అన్నమాట వేదమని ప్రకటించిన శివపాల్… ఏకంగా పార్టీకి,మంత్రి పదవికి రాజీనామా చేశాడు.అయితే, మంత్రిపదవికి ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తిరస్కరించారు.
మరోవైపు శివపాల్ గౌరవ మర్యాదలను కాపాడాలని, ఆయన నుంచి తప్పించిన మంత్రిత్వశాఖలన్నింటినీ తిరిగి ఇవ్వాలని, సమాజ్వాదీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఇవ్వాలని ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగుతున్నారు. అయితే, తన తండ్రి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్తోను, సీఎం అఖిలేష్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారని శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ చెప్పారు.