కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లాస్థాయి ప్రభుత్వశాఖల పునర్వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలుచేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జిల్లాల పునర్విభజన పురోగతిని సమీక్షించేందుకు ఈ నెల 6న జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో చెప్పారు. డిజిటలైజేషన్‌లో అనుభవజ్ఞులు, అర్హులైన ఇంజినీర్లను కలెక్టర్లకు సహాయకులుగా నియమించాలన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను భవిష్యత్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు కలెక్టర్ల కంప్యూటర్లలో ఉండేలా రూపొందించుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీ అవలక్షణాలేవీ లేకుండా రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ప్రభుత్వశాఖల పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని స్పష్టంచేశారు. గత పద్ధతులు, సంప్రదాయాలనే పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలకు మేలుచేసేలా శాఖల పనితీరును రూపొందించాలన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు అన్ని శాఖల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం తెలిపారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు ఎటువంటి పైరవీలకు తావులేకుండా ప్రణాళిక రూపొందించాలన్నారు. గతంలో మాదిరిగా ఉద్యోగులంటే వాళ్లను దొంగల్లా భావించే పద్ధతి ప్రభుత్వంలో ఉండకూడదని, పథకాల అమలు, పరిపాలనలో వాళ్లు కూడా భాగస్వాములేననే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. పునర్విభజన ప్రక్రియలో వీలైనంతవరకు అర్హులకు పదోన్నతులు కల్పించి.. వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాని, చిన్న చిన్న అనుబంధ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలని సూచించారు.
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండాల్సిన ప్రాంతం.. గత పాలకుల నిర్లక్ష్యంతో కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 58 ఏండ్ల చరిత్రలో ఒక్క ఏడాది మాత్రమే ఇరిగేషన్ శాఖకు రూ.15,500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని, ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి రూ.25వేల కోట్ల చొప్పున కేటాయిస్తున్నామన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వ్యవసాయ గిడ్డంగులే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే 21 లక్షల టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు నిర్మించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి పథకాల నుంచి సాగునీటి సరఫరా కావడం సంతోషంగా ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్య విషయమన్నారు. నేరాల అదుపునకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త మండల కేంద్రాల్లో ఠాణాలు, సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు.
దసరానాడు కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవానికి తాను, ఇతర జిల్లాల్లో పరిపాలనా ప్రక్రియ ప్రారంభానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపి తదితర ఉన్నతాధికారులు హాజరుకానున్నారన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్, శాంతికుమారి, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.