విమానాన్నే తయారు చేసుకున్నాడు..

237
planen
planen
- Advertisement -

భారత్‌లో సాధారణంగా వాహనదారులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పవు. రోడ్లు ఎలా ఉన్నా.. ఎన్ని గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా ఆఫీస్‌కి వెళ్లాల్సిందే. అయితే చెక్ రిపబ్లిక్ కు చెందిన 45 ఏళ్ళ ఫ్రాంటిసెక్ అడ్వారాకు మాత్రం ఆఫీసుకు వెళ్ళే 14 నుంచి 15 నిమిషాల ప్రయాణం కూడా కష్టమయ్యింది. ప్రతిరోజూ తన కారులో ఆఫీసుకు వెళ్ళే డ్రైవింగ్ సమయానికి అతడు విసిగిపోయాడు. తన ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలంటే ఏంచేయాలో ఆలోచించాడు. తనకు చిన్నతనంనుంచే ఇష్టమైన విమానాల తయారీపై దృష్టిసారించి, స్వంతగా ఓ విమానాన్నే తయారు చేసుకున్నాడు.

plane

నైరుతి చెక్ లోని జ్డికోవ్ గ్రామానికి చెందిన ఫ్రాంటిసెక్ అక్కడికి దగ్గరలోని డ్రెవోస్ట్ రోజ్ పట్టణంలోని ఓ కర్మాగారంలో ఉదయం 6 గంటల షిష్టుకు వెళ్ళాల్సి వచ్చేది. ఆ సమయంలో 14 నిమిషాల ప్రయాణాన్నే ఆయన చాలా ఎక్కువగా భావించడంతో.. తన ప్రయాణ సమయాన్ని తగ్గించుకునేందుకు రెండు సంవత్సరాలు కష్టపడి అల్ట్రా లెట్ ఆధారిత ఆమెరికా డిజైన్ కు చెందిన మిని-మాక్స్ విమానాన్ని రూపొందించాడు. వాతావరణం అన్ని విధాలుగా అనుమతిస్తే తాను రూపొందించిన విమానంలో కేవలం 7 నిమిషాల్లోనే ఆఫీసుకు చేరుకోవచ్చని చెప్తున్నాడు.

మూడు సిలిండర్లతో నడిచే ఇంజిన్ తో పాటు, చెక్కను ఉపయోగించి ఈ విమానాన్ని తయారు చేశాడు. దీనికి సుమారు 2,75,000 రూపాయలు ఖర్చు చేశాడు. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానానికి ఆరు లీటర్ల పెట్రోలు ఖర్చవుతుంది. సమయం వృధా కాకుండా ఉండేందుకు చేసిన ఫ్రాంటిసెక్ ఆలోచనను కంపెనీ యాజమాన్యం, తోటి ఉద్యోగులు అభినందించారు. ఫ్రాంటిసెక్ పదేళ్ళ వయసులో ఓల్డ్ వార్ విమానాలపై వచ్చిన ఓ టీవీ డాక్యుమెంటరీని చూసి, చివరికి తన కల సాకారం చేసుకున్నాడు.

- Advertisement -