వినాయక చవితి.. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన బొజ్జ గణపయ్య పుట్టిన రోజు జరుపుకునే ఈ పండుగను దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకుంటారు. భారతీయ పండుగలలో ఈ పండగకు ఉండే ప్రాధాన్యతే వేరు. వినాయకుడి పుట్టిన రోజు.
వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు గణనాథున్ని ప్రార్థించటం సర్వసాధారణం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ వినాయకుడి పర్వదినం. ఈ పండగంటే అందరికీ అమితమైన ఇష్టం. వినాయక చవితి వస్తుందంటే ప్రధానంగా యువకుల్లో ఎనలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. పండగ వచ్చిందంటే చాలు ఊరు, వాడ గణేష్ విగ్రహాలతో కళకలాడిపోతాయి.
అలాగే చవితి పందిళ్లలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రతీ సందులోనూ పందిరి ఉన్నా.. ఏ గణేషుడికే ఆ గణేషుడే డిఫరెంట్ గా దర్శనమిస్తుంటాడు.
ఈ పండగ ఇంకా ఆరు, ఏడ్నెళ్లు ఉండగానే తయారీదారులు ప్రతిమలను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమవుతారు. ఆకర్షణీయమైన రూపాల్లో, ఆకట్టుకునే రంగుల్లో గణేష్ ప్రతిమలు విక్రయానికి సిద్ధం చేస్తారు. మండపాల నిర్వాహకులు కొందరు తమకు కావాల్సిన డిజైన్లలో, నచ్చిన రంగుల్లో విగ్రహాల తయారు చేయించుకుంటారు.
గణేషుడిని తమ ఫ్రెండ్ గానో.. కుటుంబ సభ్యుడిగానో భావించేసే మన జనాలు.. రకరకాల క్రేజీ అవతారాల్లో వినాయకుడిని తయారు చేస్తుంటారు. గతేడాది బాహుబలి గణేషుడు ప్ర్యత్యేక ఆకర్షణ కాగా.. ఈ సారి ‘వినాయక గ్యారేజ్’ ఆకట్టుకుంటోంది. జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే టైటిల్- ట్యాగ్ లైన్ నుంచి.. ‘వినాయక గ్యారేజ్.. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును’ అంటూ రూపొందిన ఓ పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. ఇలాంటివి ఈ నవరాత్రులు ముగిసే సరికి ఇంకెన్ని కనిపిస్తాయో చూద్దాం..