నిప్పులపై నడిచిన ఐజీ…మహిళా ఎస్పీ

528
- Advertisement -

మూడనమ్మకాలకు భారతదేశం పెట్టింది పేరు. సంస్కృతి,మతం,ప్రాంతాల వారిగా ఒక్కొక్కరు కొన్ని మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. వీటిలో కొన్ని మూఢ నమ్మకాలకు సైంటిఫిక్ కారణాలుండగా…మరికొన్ని సిల్లీగా అనిపిస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో,అడవీ ప్రాంతాల్లో నివసించే వారు మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో కొత్త జనరేషన్ తరం సైతం మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు.

ఇలాంటి మూఢనమ్మకాలను పారదోలేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నడుం బిగించారు. ఏకంగా ఓ ఐజీ,మహిళా ఎస్పీ నిప్పులపై నడిచి ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేశారు. బిలాస్‌పూర్‌కు చెందిన ఐజీ వివేకానంద్, ముంగేలి ఎస్పీ నీతు కమల్‌ కలిసి మూఢ విశ్వాసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చేతబడులు, మంత్రాలు లాంటివి లేవని చెబుతూ వాటిని ఎలా చేసి ప్రజలను నమ్మిస్తారో ప్రజలకు వివరించారు. ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ముంగేలిలో నిప్పుల కొలిమి ఏర్పాటు చేయించి స్వయంగా దానిపై నడవడమే కాకుండా విద్యార్థులు, గ్రామస్థులతోనూ కాళ్లకు చెప్పులు లేకుండా నడిపించారు. ముంగేలీలో ఇటీవల మూఢనమ్మకాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో వాటికి పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన ఐజీ, ఎస్పీలు ఇలా నిప్పులపై నడిచి అవగాహన కల్పించారు.

గుడ్డిగా కొన్ని ఆచారాలను ప్రోత్సహించడాన్ని ప్రజలు మానుకోవాలని సూచించారు.ఇటీవల కాలంలో ముంగేలీలో ఈ తరహా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాటిపై అవగాహన కల్పించేందుకు ఉన్నత శ్రేణి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

- Advertisement -