ప్రస్తుతం దేశంలో ‘జియో’ ఫీవర్ నడుస్తున్న క్రమంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏ ఇద్దరు కలిసినా ఈ సిమ్‌కార్డుల కోసమే మాట్లాడుకుంటున్నారు. మూడు నెలలపాటు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, డేటా అందుబాటులో ఉండడంతో సిమ్‌ను దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రిలయన్స్ జియో దెబ్బకు ఇతర నెట్‌వర్క్‌లు తమ డేటా ప్యాక్‌ల ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజా ప్రకటనతో మరో సంచనానికి తెరలేపింది.
రిలయన్స్ జియోకు ధీటుగా 249 రూపాయలకే నెల రోజుల కాలపరిమితితో అపరిమిత ఇంటర్నెట్‌ను అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు, 50 రూపాయలకు 1జిబి అందిస్తామని ప్రకటించిన రిలయన్స్ జియోకు పోటీగా 1 రూపాయికే 1జిబి అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. 1జీబీ ఉన్న ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటే కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ శ్రీవాత్సవ తెలిపారు. అయితే ఈ అపరిమిత డేటా ఆరునెలలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నిర్దిష్ట చార్జీలు వర్తిస్తాయని ఆయన వివరించారు. కేవలం బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని శ్రీవాత్సవ చెప్పారు. 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ అపరిమిత డేటా సేవలు వినియోగదారులు పొందగలరని సీఎండీ శ్రీవాత్సవ తెలిపారు.
మరోవైపు జియో సిమ్‌లకు అనూహ్య స్పందన రావడంతో కొందరు ఈ సిమ్‌లను బ్లాక్ చేస్తున్నారు. ముంబైలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఈ సిమ్ కోసం యువతీయువకుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో సిమ్‌లను కొందరు కావాలనే బ్లాక్ చేస్తున్నారు.
సిమ్‌కార్డును రూ.500కు విక్రయిస్తుండగా అప్లికేషన్‌ను సైతం వంద రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రూ.500 మాత్రమే కాదు.. వెయ్యి రూపాయలైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మొబైల్ వినియోగదారులు చెబుతుండడం గమనార్హం. కాగా జియో సేవలు రేపటి(5వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలలపాటు అంటే డిసెంబరు 31వ తేదీ వరకు జియో ఫ్రీ సేవలు అందుబాటులో వుంటాయి. ఇక సెప్టెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా జియో సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు.