ఓ కన్నడ సినిమా షూటింగ్ జరుగుతుండగా అపశ్రుతి చోటు చేసుకుంది. బెంగళూరులోని బాగలూరు వద్ద నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న‘రణం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి కారుతో స్టంట్ దృశ్యాలను చిత్రీకరిస్తుండగా.. చూడటానికి పలువురు అక్కడికి వెళ్లారు. షూటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో సుయేరా బాను, అయిషా ఖాన్ తల్లీ కుతురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గాయపడిన చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పేలుడు తర్వాత షూటింగ్ నిలిపేసిన చిత్ర బృందం అక్కడి నుంచి పారిపోయారు. ఈ సినిమాలో చిరంజీవి సర్జా, చేతన్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పేలుడు తర్వాత వేరే చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు చిరంజీవి సర్జా మైసూరుకు వెళ్లగా.. చేతన్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.