కేంద్ర విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలి: హరీశ్

236
harish
- Advertisement -

పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజల కోపానికి బీజేపీ గురవుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ రోజు సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఇందులో భాగంగా దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం రూ.1.60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ను మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ- తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. రైతుల బోరు బావులకు మీటర్లు పెట్టాలని బీజేపీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెబుతున్నదని, దుబ్బాకలో బీజేపీ ఓటు అడగాలంటే.. రైతుల బోరు బావుల మీటర్లకై పార్లమెంటులో పెట్టిన బిల్లు ఉపసంహరణ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సూచన ఇచ్చారు. దౌల్తాబాద్ ప్రాంత రైతుల మేలు కోసం దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంతో ఆలోచన చేశారని తెలిపారు.

గత ప్రభుత్వాల హాయాంలో కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేదని, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్స్ పేలి పోవడం జరిగేవని.. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి వెల్లడి. ఢీల్లీలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ బావుల వద్ద బోరు బావులకు మీటర్లు బిగించాలని అంటున్నదని, కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, దుబ్బాకలో 43 వేల 89 బోరు బావుల రైతులకు అన్యాయం జరగనుందని కేంద్ర నిర్ణయం తీరుపై విమర్శలు చేశారు.

రైతుల కోసం రైతు బంధు, రైతు భీమాతో పాటు ఎన్నో రైతు సంక్షేమ పథకాల కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాక నియోజకవర్గంలో 20 వేల మంది బీడీ కార్మికులకు బీడీ కార్మిక భృతి ఇస్తున్నదని, అదే విధంగా 56 వేల 906 మంది అర్హులకు ఆసరా ఫించన్లు అందిస్తున్నట్లు, అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి రైతులకు, పేదలకు సీఎం కేసీఆర్ మరింత దగ్గరయ్యారని మంత్రి వెల్లడించారు.

అనంతరం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లి గ్రామంలో రూ.1.10కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి వెంట గ్రామ సర్పంచ్ లు యాదమ్మ, సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, విద్యుత్తు శాఖ ఏస్ఈ కరుణాకర్ బాబు, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ, మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -