ఈ ముదురు.. రాజన్‌ గురువే

224
raghu ram
raghu ram
- Advertisement -

ఆయన నిక్కచితనం గల ఆర్థికవేత్త. ముక్కుసూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆయన నైజం. చాలా అంశాల్లో ఆయన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఆర్బీఐ గవర్నర్‌గా అతి తక్కువకాలంలో తనదైన ముద్రవేశాడు. ఆయనే మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్‌ మళ్లీ తన పాతవృత్తి ఉపాధ్యాయ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. మరీ ఆయనను ఇంతలా తీర్చిదిద్దింది ఎవరో తెలుసా… ఈ ఫోటోలో కనిపిస్తున్న ముసలాయన. పేరు.. అలోక్‌సాగర్‌. అదేంటీ ఈ వయసులో ఇలా కనిపిస్తున్నాడు. ఆయన ఒక అసమాన్యుడు. 1973లో దిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. ఐఐటీ దిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు. అయినా జీవితంలో ఏదో తెలియని వెలితి. ఏం చేయాలో తోచక దేశమంతా తిరగడం మొదలు పెట్టాడు. తిరగడం అంటే టూరిస్ట్‌గా కాదు.. లక్షలు సంపాదించే స్టామినా ఉన్న ఆయన.. తన జీవితంలో దొరకని వెలుగు కోసం వెతకడం మొదలు పెట్టాడు.

Alok sagar

చివరికి కనీసం విద్యుత్‌.. రోడ్డు సౌకర్యంలేని మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామమైన కొచాము చేరుకున్నాడు. ఇక అక్కడే ఉండి ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకటి కాదు.. రెండు.. కాదు.. ముప్పై ఏళ్లు అక్కడే ఉన్నాడు.. వాళ్లలో కలిసిపోయాడు. అక్కడున్న ఆదివాసీల కోసమే బ్రతకడం మొదలు పెట్టాడు. బేతుల్‌.. హోషంగాబాద్‌ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాడు. దేశానికి సేవ చేయడం అంటే.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడమే అని నమ్మి వారి కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 50 వేల మొక్కలు నాటిన అలోక్‌ సాగర్‌.. ఇప్పటికీ.. సాధారణ జీవితాన్నే గడుపుతున్నాడు. కేవలం అతని దగ్గర మూడు జతల కుర్తాలు.. ఓ సైకిల్‌ మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు ఆ సైకిల్‌పైనే తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ.. మారుమూల ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నాడు.

 

ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే.. ‘దేశంలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కానీ.. చాలామంది ప్రజలకు సేవ చేయడం మరచి తమ సర్టిఫికెట్స్‌ చూపించుకునేందుకే వారి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు’ అని అంటున్నాడు అలోక్‌.

alok sagar

ఇంతకీ ఆయన విషయం ఇప్పుడెందుకు భయటకు వచ్చిందంటే.. ఇటీవల బేతుల్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన ప్రజలకు తెలియజేసింది. ఎన్నికల సమయంలో అధికారులు అలోక్‌ విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే తాను ఎవరు? ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు? విద్యార్హతలు ఏంటన్న విషయాన్ని వెల్లడించాడు. అవి చూసి అక్కడి అధికారులు కూడా నమ్మలేదు. కానీ అతను చెప్పిన వివరాలపై విచారించి.. నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయారు అక్కడి జనం. మంచి ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం వదిలి సాధారణ వ్యక్తిలా కనీస సౌకర్యాలు లేని సామాన్యుల కోసం చేస్తున్న అతని కృషి.. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

- Advertisement -