భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్‌కు మొట్టమొదటిసారిగా చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పామని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. ఉగ్రవాదులను హతమారుస్తూ సైనికులు చేసిన దాడులు అద్భుతమని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటుందని, పీవోకేలో భారత సైన్యం దాడులే జరపలేదంటూ ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడినుంచి తరలించిందని ఆయన అన్నారు. ఆ దాడికి సంబంధించిన ఆధారాలు, వీడియో ఫుటేజి సర్కారు వద్ద ఉన్నాయని.. ఆ ఆధారాలను బయట పెడితే భారత సైన్య వ్యూహాలు బయటపడతాయి కాబట్టి, ఆ అంశంపై ప్రభుత్వమే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంతేకానీ, ప్రతిపక్ష నేతల డిమాండ్లపై స్పందిస్తూ ఆ వీడియోలు బయటపెట్టడం సరికాదని అన్నారు.
అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్లుగానే…దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేయాలని రాందేవ్ సూచించారు. వాళ్ల చావుతో ప్రపంచం మొత్తానికి శాంతి లభిస్తుందని, ఇలా చేసినందుకు మోడీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కోన్నారు.
పాకిస్థాన్‌లోని యువతరం ఉగ్రవాదానికి ఆకర్షితులు కావాడానికి చదువు లేకపోవడమేనని.. వారు చదువుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకోసం భారతీయులంతా కొద్దికొద్దిగా విరాళాలు ఇవ్వాలని ఈ సంధర్బంగా అన్నారు. అక్షరాస్యత సాధిస్తేనైనా ఉగ్రవాద ఆలోచనలు వారి మెదళ్ల నుంచి వదులుతాయని అన్నారు. పాక్‌లో అలాంటి కార్యక్రమం చేపడితే దానికి తమ పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. అలాగే, చైనా ఉత్పత్తులను భారత్ బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.చైనా అంశంపై స్పందించిన రాందేవ్ ఆ దేశం నుంచి భారత్‌కు వెన్నుపోటు తప్ప ఏమీ రాలేదని వ్యాఖ్యానించారు.