నిత్య పెళ్లికుమారులను చూశాం.. కానీ నిత్య పెళ్లికూతుర్లను చూడలేదు. మాయమాటలు చెప్పి పలువురిని వివాహాలను చేసుకుని మోసం చేసే మగాళ్లు ఉన్నారు.. కానీ ఈవిడ మాత్రం ఏకంగా ఎనిమిది మందిని వివాహామాడి అందరిని మోసం చేసింది. బాధిత భర్తల ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.
కర్ణాటకలోని కేజీ హళ్లిలో విచిత్రమైన కేసు బుక్ అయ్యింది. తన భార్యకు ఏడుగురు భర్తలున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడో వ్యక్తి. అంతే కాదు రోజూ తనను కొడుతోందని.. తనను మీరే రక్షించాలంటూ పోలీసులను వేడకున్నాడు. అతను అలా కేసు పెట్టాడో లేదో.. ఆ కంప్లయింట్ కు తగ్గట్టే ఆమె తమ భార్యేనంటూ మరో ఇద్దరు ముందుకు వచ్చారు. ఇదంతా చూసిన పోలీసులకు దిమ్మతిరిగింది.
తూర్పు బెంగళూరులోని కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్య యాస్మిన్ బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాస్మిన్‌కు మగవాళ్లను మోసం చేసే అలవాటు ఉందని, ఆమె తన మీద దాడి చేస్తోందని వాపోయాడు.
యాస్మిన్ తమను కూడా పెళ్లి చేసుకుందని షోయబ్, అఫ్జల్ అనే మరో ఇద్దరు పోలీసులకు తెలిపారు. యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బు అడిగిందని, ఇవ్వనని చెప్పేసరికి తనను వదిలి వెళ్లిపోయిందని రియల్ ఎస్టేట్ ఏజెంటుగా పనిచేసే అఫ్జల్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ముందుగా ఇమ్రాన్ మీద దాడిచేసి కొట్టినందుకు యాస్మిన్ మీద కేసుపెట్టారు. 8 మంది మగవాళ్లను మోసం చేసిందని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న యాస్మిన్ బాను మాయం అయ్యింది. ఆమె ఎంత మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.