పాక్ టీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై వేటు పడింది.ఇంగ్లాండ్‌తో వచ్చే బుధవారం జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్టర్లు అందులో అఫ్రిదికి మొండిచేయి చూపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ అఫ్రిది కెప్టెన్సీని వదులుకున్నాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రం వైదొలగనని.. ఆటగాడిగా టీ20 జట్టులో కొనసాగుతానని అప్పట్లో అఫ్రిది స్పష్టం చేశాడు. పాక్ క్రికెట్ చీఫ్ ఇంజమామ్ ఉల్ హక్‌తో గొడవ కారణంగానే ఆఫ్రిది జట్టులో స్థానం కొల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. అతనితో పాటు ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లు అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు.
టీ20 జట్టులో అఫ్రిదిని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ.. ‘దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడి మునుపటి ఫామ్‌ను అఫ్రిది అందుకోగలిగితే జట్టులో అవకాశం దక్కుతుందని గతంలోనే చెప్పాం. అతనితో పాటు అహ్మద్, ఉమర్‌లు క్రమశిక్షణతో ఉండి.. మెరుగైన ప్రదర్శన చేయగలిగితే కచ్చితంగా వారి ఆటతీరును పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఏకైక టీ20 మ్యాచ్ కావడంతో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశాం’ అని వివరించాడు. ఈ టీ20 జట్టుకు కీపర్/బ్యాట్స్‌మెన్ సర్పరాజ్ అహ్మద్ తొలిసారి నాయకత్వం వహించనున్నాడు.

