దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైం స్టోరీని వండివారుస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనంతపురం ఫ్యాక్షన్ ముఠాకక్షల నేపథ్యంలో ’రక్తచరిత్ర’, ’రక్తచరిత్ర-2’ సినిమాలను వర్మ తెరకెక్కించాడు. అలాగే, ముంబై మాఫియా నేపథ్యంతో ’సత్య’ వంటి సంచలన చిత్రాన్ని అందించాడు.
పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం ఇంకా తమ పని పూర్తి చేయలేదు గానీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కు సంబంధించిన చిత్రం పని మొదలెట్టేశారు. మూడు భాగాలుగా నయీం కథను తెరకెక్కిస్తానని ప్రకటించిన వర్మ ఇవాళ తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశారు. సత్య, రక్త చరిత్ర, వంగవీటి వంటి మాఫియా, ఫ్యాక్షన్ సినిమాలను తనదైన స్టైల్‌లో రూపొందించే వర్మ నయీం జీవిత చరిత్రను ఏ విధంగా చూపెడతాడా అని అందరిలో ఆసక్తి పెరిగింది. గ్యాంగ్ స్టర్, క్రిమినల్, గూండా, అండర్ వరల్డ్, నక్సలైట్ అన్న పదాలతో నయీం పేరు చెక్కిన ఓ పోస్టర్ అది.. ఇది టైటిల్ లోగో పోస్టర్ అని చెబుతూ నిజానికి దీన్ని తాను తయారు చేయించలేదని, ఎవరో సృజనాత్మకంగా డిజైన్ చేసినదానిని తాను షేర్ చేస్తున్నానంతేనని ఆయన చెప్పారు.
తాజాగా నెట్ లో నయీం కు సంబంధించిన ఓ పోస్టర్ హాల్ చల్ చేస్తుంది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. రాము నయీం ను ఎలా చూపిస్తాడు అనేది కూడా ఆసక్తికరఅంశమే.!