మేస్ట్రో ఇళయరాజా పాటలంటే చెవి కోసుకోని తెలుగువారు ఉండరు. ఆయన పాటలకు ఎలాంటి వారైనా తలలూపి తీరుతారంతే. అంతటి సంగీత జ్ఞాని తాజాగా తెలుగువారి కోసం ఓ ప్రత్యేకమైన కాన్సర్ట్ చేయడానికి అంగీకరించారు. అదీ యుఎస్ ఎ , కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో. ఈ నెల 10న, శనివారం జరిగే ఈ కాన్సర్ట్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. కాన్సర్ట్ కు తెలుగువారి అభిమాన విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్, స్వాగత్ ఎంటర్‌టైన్‌మెంట్, లావణ్య దువ్వి, యు స్మైల్ డెంటల్ ఆధ్వర్యంలో ఈ కాన్సర్ట్ జరగనుంది. నిర్వాహకులు మాట్లాడుతూ “ఇప్పటిదాకా ఇళయరాజాగారు యుఎస్ ఎ లో పలు సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. మరీ ముఖ్యంగా 2013లో యుఎస్ ఎ లో ఓ సారి కాన్సర్ట్ చేశారు. తాజాగా మరో ఐదు ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి కూడా అంగీకరించారు. అయితే అవన్నీ తెలుగు, తమిళం కలగలిపిన పాటలతో ఉంటాయి. కానీ సెప్టెంబర్ 10న మేం నిర్వహిస్తున్న కార్యక్రమం మాత్రం సంపూర్ణంగా తెలుగువారి కోసమే. ఇందులో ఇళయరాజాగారి ఆధ్వర్యంలో తెలుగు పాటలను మాత్రమే పాడుతారు.
సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా వెయ్యి చిత్రాల మైలు రాయిని దాటుతున్న తరుణంలో ఇసైజ్ఞాని, పద్మభూషణ్ ఇళయరాజాగారు మాకోసం ఈ కార్యక్రమాన్ని అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. సింఫనీ ఆర్కెస్ట్రాతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహం. దాదాపు 50 మందికి పైగా సంగీతకారులు, కోరస్ గాయనీగాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రఖ్యాత గాయనీ గాయకులు చిత్ర, సాధనా సర్గమ్, మనో, కార్తిక్, ప్రియా హిమేష్, అనితా కార్తికేయన్‌తో పాటు పలువురు శాన్ జోస్‌కి రానున్నారు. ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌గారు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు“ అని చెప్పారు.