ప్రజలు కోరుకున్న తెలంగాణను 100% నెరవేరుస్తా-సీఎం కేసీఆర్‌

122
cm kcr
- Advertisement -

తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రమణ,ఆయన అనుచరులకు స్వాగతం పలికారు. రమణ 25 యేండ్లుగా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు…రమణ ఏ పార్టీలో ఉన్నా ఆ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి…ఇలాంటి వారు రాజకీయ పార్టీ లకు కావాలి అని అన్నారు. రాష్ర్ట అభివృద్ధికి త‌న వంతు స‌హ‌కారానికి ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిబ‌ద్ధ‌త గ‌ల వ్య‌క్తి పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ర‌మ‌ణ‌కు మంచి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌న్నారు. టీఆర్ఎస్‌లో చేనేత వ‌ర్గానికి త‌గిన ప్రాతినిధ్యం లేద‌న్న లోటు ర‌మ‌ణ చేరిక‌తో తీరింద‌న్నారు.

చేనేత సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చేనేత కార్మికుల‌కు రైతు బీమా కోసం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. ఒక‌ట్రెండు నెల‌ల్లో చేనేత‌ల‌కు బీమా వ‌ర్తిస్తుంద‌ని సీఎం తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూర‌త్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల‌పై సూర‌త్‌కు అధికారులు పంపామ‌ని గుర్తు చేశారు. రాష్ర్టంలో జౌళి ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తే తిరిగి వ‌స్తామ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్‌లో వెయ్యి ఎక‌రాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఆ పార్కులో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు వ‌స్తున్నారు. ఒక పారిశ్రామిక‌వేత్త 3 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపారు అని సీఎం గుర్తు చేశారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీటి పారుద‌ల రంగంలో నేర‌పూరిత నిర్ల‌క్ష్యంతో తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని సీఎం గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో రాష్ర్ట ఏర్పాటు కంటే ఆరు నెల‌ల ముందే తెలంగాణ పున‌ర్నిర్మాణం గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్, ఆర్ విద్యాసాగ‌ర్ రావు స‌మ‌క్షంలో మిష‌న్ కాక‌తీయ వంటి ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. ఇప్పుడు ఈ ప‌థ‌కం అద్భుతంగా అమ‌ల‌వుతుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌తి గ్రామంలో ప్ర‌జ‌ల ప్ర‌త్య‌క్ష అనుభ‌వంలో ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల‌ని ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చారు. చిన్న త‌ప్పు దొర్లితే కొన్ని త‌రాల‌కు దెబ్బ‌కొడుతుంది. అందుక‌నే అజెండా ప్ర‌కారం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించి ముందుకెళ్తున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటు అయితే ధ‌నిక రాష్ర్టంగా మారుతామ‌ని రాష్ర్టం ఏర్పడ‌క ముందే చెప్పాన‌ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ జీతాలు ఇస్తామ‌ని చెప్పాం. అది జ‌రుగుతుంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారు. నిన్న 40 ఎక‌రాలు అమ్మితే రూ. 2 వేల కోట్లు వ‌చ్చాయి. ఇలా వ‌చ్చిన ప్ర‌జా ధ‌నాన్ని ప్ర‌జ‌ల సంక్షేమం కోసమే వినియోగిస్తామ‌ని తేల్చిచెప్పారు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్ర‌స్థానంలో ఉంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత భూ వివాదాలు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు. తాను ఏ తెలంగాణ‌ను కోరుకున్నానో.. అది ఆవిష్క‌రించి తీరుతాన‌ని, రాబోయే రోజుల్లో తెలంగాణ‌కు ఉజ్వ‌లమైన భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రమణ రూపంలో మంచి రాజకీయ నాయకుడిని చూస్తారు. త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తాం. అవకాశం చిక్కినప్పుడల్లా పద్మశాలీలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని సీఎం తెలపారు. గుండు సుధారాణి కి వరంగల్ మేయర్ గా అవకాశమిచ్చాము. పార్థసారధిని ఎన్నికల కమిషనర్ గా నియమించాం. ఇలాగే ఇంకా మరింత మందికి అవకాశాలు ఇస్తామన్నారు. మీ దీవెనలు నాకు కావాలి.. ప్రజలు కోరుకున్న తెలంగాణను 100శాతం నెరవేరుస్తాను. కేసీఆర్ కు ప్రజలు కలగన్న తెలంగాణ తప్ప వేరే పనిలేదు..నా లైన్ ను ఎవ్వరూ మార్చలేరు.నాకు ఈ వయసులో తెలంగాణ ధ్యాస తప్ప మరొకటి లేదు.నేను కలలు కన్న రీతిలో తెలంగాణ అభివృద్ధి అయ్యేదాకా విశ్రమించను అన్నారు. కొందరు సన్నాసులు ఉద్యమంలో విమర్శించారు.ఇపుడు అదే పని చేస్తున్నారు అని సీఎం మండిపడ్డారు.

- Advertisement -