‘అఖిలేశ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేయాలి, అఖిలేశన్న పార్టీని నడిపించగల సమర్థుడు’ అంటూ గట్టిగా అరుస్తూ పార్టీ కార్యాలయం వద్ద సందడి చేశారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన నాలుగు ఇతర సంస్థలు ఈ డిమాండ్ తో పార్టీ అధినేత ములాయం సింగ్ కు లేఖ కూడా రాశారు. అందులో తాము అఖిలేశ్ నాయకత్వాన్ని తప్ప ఏ ఒక్కరి నాయకత్వాన్ని అంగీకరించబోమని కుండబద్ధలు కొట్టారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ములాయం సింగ్.. తాను నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి పార్టీని ఈ రోజు ఈ స్థానానికి తీసుకొచ్చానని, ఇకపై పార్టీలో సర్కస్‌లు జరగవని కుండబద్దలు కొట్టారు. యూపీలోని పార్టీ ఆఫీస్‌కు చేరుకున్న ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌ను నిరసనలు ఎదురయ్యాయి. నేరుగా పార్టీ ఆఫీస్‌లోని ఆడిటోరియంలో కార్యకర్తల ముందే ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు చీవాట్లు పెట్టారు.
ములాయం మాట్లాడుతూ.. “నువ్వు నా కుమారుడివి కాబట్టే నిన్ను సీఎంగా ప్రజలు అంగీకరించారు. పదవి, పేరు లభించిన కారణాన్ని తెలుసుకో. నేను, శివరాజ్ పార్టీని పెట్టినప్పుడు నువ్వు స్కూలుకెళ్లే చిన్న పిల్లాడివి. సీఎం అయిన తరువాత ఏం జరిగింది? నీ మాట ప్రకారం వెళితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఐదుగురే గెలిచారు. శివపాల్ చెప్పినట్టు వినుంటే 30 నుంచి 35 సీట్లు లభించేవి. నేను ప్రధాన మంత్రిని అయ్యుండేవాడిని. నీ వల్ల దక్కుతుందనుకున్న ప్రధాని పదవి దక్కలేదు” అని వ్యాఖ్యానించారు.
పార్టీ మేనిఫెస్టోయే ఓట్లను సాధించిపెట్టి, అఖిలేష్ ను సీఎంను చేసిందని, దాన్ని రాసింది శివపాల్, రాంగోపాల్ యాదవ్ లేనని ములాయం గుర్తు చేశారు. పార్టీ కోసం వారు అనునిత్యమూ శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో అమర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఓ కార్యకర్త డిమాండ్ చేయగా, ములాయం మండిపడ్డారు. “అమర్ సింగ్ ఎవరో నీకు తెలుసా? నాపై సీబీఐ విచారణ జరుగుతున్న వేళ, అండగా నిలిచేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోయినా, అమర్ ఒక్కరే నిలిచారు” అంటూ, ఆయనపై ఎలాంటి చర్యలూ ఉండబోవన్న సంకేతాలిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములూ తన ఆలోచనలేనని చెప్పుకొచ్చారు.
అమర్‌సింగ్ ములాయంకు సన్నిహితుడే అయినా అఖిలేష్‌కు సన్నిహితంగా ఉండే రామ్‌గోపాల్ యాదవ్ బాబాయ్‌కి ఆయన శత్రువు. వారిద్దరికీ అసలు పడదు. కుటుంబసభ్యుల మధ్య కొనసాగుతున్న ఈ రసవత్తర రాజకీయ నాటకంలో ఎప్పుడూ విజయం ములాయం సింగ్ యాదవ్‌దే. ఆయన సన్నిహితులదే. ఇక అఖిలేష్ యాదవ్ పరిస్థితి ‘బొమ్మరిల్లు’ సినిమాలో తండ్రి చేయి వీడని తనయుడి లాంటిదేనని అర్థమవుతోంది.