ట్రంప్ నిర్ణయం పట్ల చింతిస్తున్నాం..జూకర్ బర్గ్, మలాలా

315
Zuckerberg
- Advertisement -

ముస్లిం దేశాల నుంచి వలసలను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా ఆంక్షలపై ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తప్పుబట్టారు. ముస్లింలపై ఆంక్షలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పై ట్రంప్ సంతకం చేయడం వల్ల ఆయా దేశాలపై పడనున్న ప్రతికూల ప్రభావం గురించి చింతిస్తున్నానని జుకర్ ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

 Zuckerberg

టెర్రరిస్టుల నుంచి అమెరికాను రక్షించుకోవడం ముఖ్యమే అయినప్పటికీ ఆపదలో ఉన్నవారికి, శరణార్థులకు సాయం చేసేందుకు విశాల దృక్పధంతో వ్యవహరించాలని జుకర్ బర్గ్ కోరారు. వారికి భరోసా కల్పించేందుకు అగ్రరాజ్య ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంచాలని సూచించారు. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా ఇలా వ్యవహరించి ఉండకపోతే చాన్‌ ప్రిస్కిల్లా ఇక్కడ ఉండేదికాదన్న జుకర్‌బర్గ్‌.. తన భార్య కుటుంబం చైనా నుంచి వలస వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.తన తాత ముత్తాతలు కూడా జర్మనీ, ఆస్ట్రియా, పోలండ్‌ల నుంచి వచ్చినవారేనని జుకర్‌ పేర్కొన్నారు. అమెరికా వలసదారుల దేశమన్న జుకర్‌ బర్గ్‌, అలాంటి వారికి మంచి జీవితాన్ని అందివ్వడం అగ్రరాజ్యానికే మంచిదని అభిప్రాయపడ్డారు. అమెరికా భవిష్యత్తులో వారూ ఒక భాగమని, దేశాన్ని ప్రపంచంలో నెంబర్‌ వన్‌ గా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా, సంయమనంతో పనిచేయడానికి ముందుకురావాలని కోరారు.

 Zuckerberg

ట్రంప్‌ నిర్ణయంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌ జాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం తనను కలిచివేసిందని అన్నారు. యుద్ధం, హింసల నుంచి తప్పించుకునేందుకు భార్యాబిడ్డలతో తలదాచుకునేందుకు వస్తున్నవారికి ట్రంప్‌ తలుపులు మూసేయడం బాధ కలిగిస్తోందని అన్నారు. ట్రంప్‌ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు.

- Advertisement -