మండల పరిషత్ ఎన్నికల్లో సత్తాచాటిన అధికార టీఆర్ఎస్ 32 జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక ఇవాళ జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుండగా అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు.జిల్లా పరిషత్ ఛైర్మన్‌ల ఎన్నికలో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 50 శాతం కోటా కింద 32 స్ధానాల్లో 16 స్థానాలు దక్కనున్నాయి.
ఈ టర్మ్‌తోపాటు వచ్చే టర్మ్‌కు కూడా ఇవే రిజర్వేషన్లు వర్తించనున్నాయి. వీటి ప్రకారం జెడ్పీ చైర్మన్లలో ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు ఆరు, బీసీలకు ఆరు స్థానాలు దక్కాయి. ఇవాళ ఉదయం 10 గంటల వరకు జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి, అర్హత సాధించినవారి పేర్లు ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువు ఇస్తారు. ఆ తర్వాత ఎన్నిక ప్రక్రియను చేపడుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా పరిషత్ మొదట కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.