2013 తర్వాత మళ్లీ ఇటీవలే వన్డేల్లో స్థానం దక్కించుకున్న టీమిండియా ప్రపంచ కప్‌ల హీరో యువరాజ్ సింగ్ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఒత్తిడిని జయిస్తు అసలు సిసలు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. బారాబతి వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తన విశ్వరూపం చూపించాడు. తన ఎంపికను తప్పుబట్టిన వారికి బ్యాట్ సమాధానం చెప్పిన యువీ భారత్ భారీ స్కోరుకు పునాది వేశాడు.
గ్రౌండ్ నలువైపుల బంతిని పరుగులు పెట్టించిన యువీ అద్భుత శతకాన్ని సాధించాడు. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన యువీ శతకం చేయగానే కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాట్‌ను డ్రెస్సింగ్ రూమ్ కేసి చూపించి తనలో పోరాట పటిమ ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. తన కెరీర్ లో బెస్ట్ స్కోరు సాధించాడు. అవతలి ఎండ్‌లో ఉన్న ధోని వెంటనే వచ్చి యువీని అభినందించాడు.
కెరీర్‌లో 14వ శతకం బాదిన యువీ కళ్లలో భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు కనిపించాయి. ఇక ఇదే వన్డేలో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని జంట సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్-ధోనిలు చెలరేగి ఆడి నాల్గో వికెట్కు 176 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని సాధించారు. తద్వారా ఇంగ్లండ్ పై నాల్గో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో దక్షిణాఫ్రికా జోడి హషీమ్ ఆమ్లా,ఏబీ డివిలియర్స్లు ఇంగ్లండ్ పై నమోదు చేసిన 172 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని యువీ-ధోనిలు తాజాగా సవరించారు.