వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన జగన్ ను ఎమ్మెల్యేలు అభినందించారు. దీంతో పాటు జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైసీపీపీ నేతను ఎన్నుకోనున్నారు.
ఇవాళ సాయంత్రం తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్‌ను కలిసి జగన్ అందచేయనున్నారు. ఇక ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి కాకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన వారికి పార్లమెంటరీ పార్టీ పదవిని కట్టబెట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం నుంచి గెలిచిన వల్లభనేని బాలశౌరి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం.
ఏపీలో సర్వేల ఉహలకు అందని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. కనీవిని ఎరుగని రీతిలో 150 స్థానాల్లో విజయ బావుటా ఎగరేసింది. ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. టీడీపీ కేవలం 24 స్థానాలకే పరిమితమైంది.