కుమారస్వామి రాజీనామా…సీఎంగా పరమేశ్వర!

161
Kumaraswamy wins trust vote

కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మోడీ సునామీలో అధికార జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమికి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్,జేడీఎస్ కీలకనేతలు ఓటమిబాటపట్టగా మాజీ ప్రధాని దేవేగౌడ సైతం ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారస్వామి రాజీనామాకు సిద్దపడ్డారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితిని దేవెగౌడకు వివరించి సీఎం పదవికి గుడ్‌బై చెప్పాలని అనుకున్నారు. ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దని ఆయన కుమారస్వామికి హితవు పలికినట్లు తెలుస్తోంది. కేబినెట్‌ సహచరులు కూడా తొందరపడొద్దంటూ ఇలాగే వారించినట్లు సమాచారం. సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని, పూర్తి కాలం కొనసాగుతుందని సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం పరమేశ్వర వ్యాఖ్యానించారు.

ఒకవేళ కుమారస్వామి రాజీనామా చేస్తే ఉపముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్‌ నేత పరమేశ్వర్‌ను ముఖ్యమంత్రి చేసేలా దేవెగౌడ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు దేవెగౌడ మనవడు, హసన్‌ నుంచి ఎంపీగా గెలిచిన ప్రజ్వల్‌ సైతం సంచలన ప్రకటన చేశారు. హసన్‌ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ 1, జేడీఎస్‌ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.