ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. లోక్ సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని కోరిన ఎంపీలు పట్టించుకోలేదు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు వైసీపీ ఎంపీలు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తాము పోరాడుతున్నామని తెలిపారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారి దుయ్యబట్టారు. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.
రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజల్లోకి తీసుకెళ్తామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకత్వం లేదని, పాలకులే మోసగాళ్లయితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడిగారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై 13వ సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చామని, వంద మందికి పైగా ఎంపీలు తమ పోరాటానికి మద్దతు తెలిపారని ఎంపీ వరప్రసాద్ రావు తెలిపారు.
రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీల్లో మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,వరప్రసాదరావు ఉన్నారు. కేంద్రం తీరు మారకపోతే తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరిరోజు మూకుమ్మడిగా రాజీనామానాలు చేస్తారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.