యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదంపైఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో 100 శాతం తనకు, తన పిల్లలకే చెందిందని స్పష్టం చేశారు. ఈ ఆస్తుల పంపకాల ప్రక్రియ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పూర్తయిందని వెల్లడించారు. పరాయి ఆస్తిపై ఆశపడే నీచత్వం తనది కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నేపథ్యంలో షర్మిల ఈ విషయాలపై స్పందించారు. ఆస్తుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో తన కుమార్తె వివాహాన్ని యలహంక ఇంట్లో కాకుండా మరోచోట నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తాను పెరిగిన సొంత ఇంట్లోనే పెళ్లి జరగాలన్న తన కుమార్తె కోరికను నెరవేర్చలేకపోయినందుకు బాధగా ఉందని పేర్కొన్నారు.
యలహంక ప్యాలెస్ ఆస్తి పంపకాల్లో తనకు, తన పిల్లలకు పూర్తి హక్కు ఉందని షర్మిల స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఆస్తుల విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వివాహ వేదికను మార్చినట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!
వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహానికి తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండాలని షర్మిల కోరారు. తన కుమార్తె కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించారు.


