ఏపీలో ఫ్యాన్ దూకుడు ముందు సైకిల్ టైర్ పంచరైంది. జగన్ దూకుడుకు చంద్రబాబుకు దిమ్మతిరిగినట్లైంది. జగన్ గెలుపులో చంద్రబాబు వైఫల్యాలకు తోడు పాదయాత్ర,షర్మిల ప్రచారం బాగా కలిసివచ్చింది. తనదైన పంచ్ డైలాగ్‌లతో చంద్రబాబును ఎండగట్టిన షర్మిలా ప్రజల్లోకి దూసుకెళ్లేలా మాటల తూటాలను వదిలింది.
బై బై బాబు..నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించింది. ఓ వైపు జగన్ మరోవైపు షర్మిలా ఏపీ మొత్తాన్ని చుట్టేశారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన షర్మిల స్ధానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే మరోవైపు చంద్రబాబు,లోకేశ్‌లపై ఫన్నీ సెటైర్లు విసిరి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది.
2012లో ఉప ఎన్నికల సమయంలో జగన్ జైళ్లో ఉండడంతో ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న షర్మిలా వైసీపీపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేశారు. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ మెరుగైన స్ధానాలు దక్కడంలో కీలకపాత్ర పోషించగా తాజాగా వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ అన్న వదిలిన బాణంలా పనిచేశారు షర్మిల.