సీఎం జగన్ చాంబర్‌లో మేనిఫెస్టో..

241
YS Jagan
- Advertisement -

ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా చూస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మేనిఫెస్టోను అధికారిక చాంబర్ ముందు గోడకు అతికించుకున్నారు. నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేమ్ లుగా కట్టించి సీఎం చాంబర్‌లో గోడలకు అంటించారు. తన గది బయటా, లోపల ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన బోర్డులను ఆయన ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

YS Jagan

దీనిబట్టే, మేనిఫెస్టోకు జగన్ ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం తెలిసిపోతుందని వైకాపా శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాగా, జగన్ తన చాంబర్‌లో తండ్రి వైఎస్ నిలువెత్తు చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. విధినిర్వహణలో భాగంగా తాను చేయాల్సిన పనులు నిత్యమూ జ్ఞప్తికి వచ్చేందుకే జగన్ ఇలా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక వైఎస్‌ జగన్‌ తొలిసారిగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించగానే అక్కడ ఏర్పాటు చేసిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.

YS Jagan

రాష్ట్రంలోని అన్ని వర్గాలు, కులాలకు లబ్ది చేకూరేలా మేనిఫెస్టోను తయారు చేసింది వైకాపా. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడం, మద్యపానాన్ని మూడు దశల్లో పూర్తిగా నిషేధించి కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం చేయడం, పంట రాబడికి ముందే కనీస గిట్టుబాటు ధర ప్రకటించడం సహా పలు అంశాలు మేనిఫెస్టోలో హైలైట్స్‌గా కనిపిస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత ఈ మేనిఫెస్టోలోని అన్ని హామీలను పూర్తి చేసి విశ్వసనీయత అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -