చంద్రబాబు ఇళ్ల పంపిణీపై జగన్ ట్వీట్

10
- Advertisement -

సీఎం చంద్రబాబు 3 లక్షల ఇళ్ల పంపిణీపై వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. మీ కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘క్రెడిట్‌ చోరీ స్కీం’ చాలా బాగుందంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.

గత వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చూపిస్తూ ఇళ్లన్నీ మేమే కట్టేశామంటూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా…ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా… గత ప్రభుత్వం అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయస్సార్‌సీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్‌ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు.

Also Read:ఏపీలో మరో భారీ పెట్టుబడి

మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్‌ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం!

- Advertisement -