యూత్ కాంగ్రెస్ నేత ఉదయ్ భాను అరెస్ట్

3
- Advertisement -

జాతీయ రాజధాని ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన షర్ట్‌లెస్ నిరసన కేసులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పలుమార్లు విచారణకు హాజరైన అనంతరం గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు యూత్ కాంగ్రెస్ చీఫ్ వద్ద ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిరసన రూపరేఖల సిద్ధంలో ఆయన కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ప్రశ్నల సమయంలో చిబ్ పూర్తిగా సహకరించలేదని, కొన్ని విషయాలను ఖండించారని లేదా సమాధానాలను మళ్లించేందుకు ప్రయత్నించారని పోలీసు వర్గాలు తెలిపాయి. తగిన ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు.

ఎఫ్‌ఐఆర్‌లో క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో అడ్డంకి కల్పించడం, అల్లర్లు ప్రేరేపించడం, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే ప్రకటనలు చేయడం వంటి పలు సెక్షన్లు నమోదు చేశారు.

అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అని ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం హక్కు అని సీనియర్ నేత భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. హింస లేకుండా నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టడం తగదని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

ఈ కేసులో ఐదో నిందితుడిగా జితేంద్ర యాదవ్‌ను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి అరెస్ట్ చేశారు. అతడికి రెండు రోజుల పోలీసు రిమాండ్ మంజూరైంది. మరికొందరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -