ఎట్టకేలకు కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సంకీర్ణ సర్కార్ కూలి రెండు రోజులు గడుస్తున్న ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నించకపోవడంతో రాష్ట్రపతి పాలన విధిస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి.
ఆ వార్తలకు బీజేపీ నేత యడ్యూరప్ప పుల్ స్టాప్ పెట్టారు. ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసిన యడ్యూరప్ప ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపిన ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. ఇవాళ యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ రమేష్ కుమార్. ఫిరాయింపుల చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారిపై అనర్హత వేటు వేసినట్టు ప్రకటించారు స్పీకర్. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడమే కాదు.. వారు 2023 వరకు పోటీచేయడానికి వీలులేదని పేర్కొన్నారు.