ఏడోసారి ఎమ్మెల్యే…మూడోసారి ముఖ్యమంత్రి

272
bjp
- Advertisement -

కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీఎస్ యడ్యూరప్ప. ఇవాళ ఉదయం 9 గంటలకు గవర్నర్ వాజుభాయ్ వాలా..యడ్యూరప్ప చేత ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన యడ్యూరప్ప .. అంచెలంచెలుగా ఎదిగి మూడవ సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

ఫిబ్రవరి 23, 1943లో మాండ్య జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని బూకనకిరిలో జన్మించారు యడ్యూరప్ప. తల్లిదండ్రులు సిద్ధలింగప్ప, పుట్టతాయమ్మ.యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకిరి సిద్ధలింగప్ప యడ్యూరప్ప. 1967లో పెళ్లి చేసుకున్న యడ్యూరప్పకు ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర, ముగ్గురు కూతర్లు అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి ఉన్నారు.

కాలేజీ చదవుకునే రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన యడ్డీ 1970లో షికారిపుర యూనిట్‌కి సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1972లో షికారిపుర మున్సిపాలిటీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనసంఘ్ తాలూకా ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 1983లో షికారిపుర నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఏడుసార్లు ఇదే నియోజకవర్గం గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం శివమొగ్గ నుంచి ఎంపీగా కొనసాగుతున్న యడ్డీ అదే పార్లమెంటు స్థానంలో ఉన్న షికారిపుర నుంచి 35 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లింగాయత్ వర్గంలో బలమైన నేతగా యడ్యూరప్పకు పేరుంది.

2007 నవంబర్ 12 నుంచి నవంబర్ 19 వరకు తొలిసారి కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన యడ్యూరప్ప రెండోసారి మే 30 2008 నుంచి జూలై 31 2011 కర్నాటక సీఎంగా ఉన్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. 2011లో సొంత పార్టీని స్థాపించిన యడ్యూరప్ప 2013 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.2018లో బీజేపీ మెజార్టీ స్ధానాలు(104) దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

- Advertisement -