ఏపీలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ నేతలు. ఓవైపు జగన్ మరోవైపు విజయమ్మ,షర్మిల సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక వైఎస్‌ను మరిపిస్తూ షర్మిల ఎన్నికల క్యాంపెయిన్‌లో మాట్లాడుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటోంది. చంద్రబాబు,లోకేష్‌లే టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తు సభకు వచ్చిన వారిలో జోష్ నింపుతున్నారు.
కృష్ణ జిల్లాలో ఎన్నికలప్రచారంలో భాగంగా చంద్రబాబు,లోకేష్ పై నిప్పులు చెరిగారు. తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. బాబు వస్తే నిరుద్యోగులకు జాబు వస్తుంది అన్నారు కానీ ఆయన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి వచ్చిందన్నారు. జయంతి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ కు మూడు మంత్రి పదవులంటూ ఎద్దేవా చేశారు.
ఏపీకి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను నీరుకార్చడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. అమరావతిని అమెరికా చేస్తామన్న బాబు ఇప్పటి వరకు ఒక్క పర్మినెంట్ భవనం నిర్మించ లేదన్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జగన్ గుంటూరు, ప్రకాశం, కృష్ణా లో ప్రచారం నిర్వహించనుండగా విజయనగరం, విశాఖ జిల్లాలో విజయమ్మ పర్యటించనున్నారు. ఇక షర్మిల పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు, కృష్ణా జిల్లాలోని కైకలూరు, పెడన నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.