వటపత్రసాయిగా.. నారసింహుడు

251
yadadri 2019
- Advertisement -

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నరసింహస్వామి.ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు.

వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా,నయణమనోహరంగా అలంకారం చేసి ప్రత్యేక పీఠంపై అధిష్టింపచేశారు.అనంతరం స్వామి అమ్మవార్ల సేవలను మంగళ వాయిద్యాలతో ఆలయ అర్చకులు చదివే వేదమంత్రాలు,రుత్విక్కుల తిరుప్పావై పఠనం వంటి అనేక మంత్రాలతో స్వామి అమ్మవార్లను బాలాలయంలో ఊరేగించారు.

సృష్ట్యాదిలో శ్రీ మహా విష్ణువు ధరించిన అద్భుత రూపమే ఈ అలంకారము.మఱ్ఱి ఆకు పై స్వామి పవళించి తన గర్భంలోని లోకములన్నింటికి పాదారవిందము చేత నోటి ద్వారా అమృతం అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వము తనకంటూ దర్శింపజేస్తూ మానవ జీవితం విలువలను ప్రకటించిన తత్వమే వటపత్ర సాయి అలంకారం అని అలంకరణ విశిష్టతను యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు.

ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న తిరు కల్యాణమహోత్సవం, 16న దివ్య విమానరథోత్సవం నిర్వహించనున్నారు. 15న ఉదయం బాలాలయంలో జరిగే తిరు కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

ఆగమశాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలను బాలాలయానికే పరిమితం చేశారు.గుహలో దేవేరితో కొలువుదీరిన పంచనారసింహుల దివ్యరూపం, ఆళ్వారుల ముఖమండపాలు,నలుదిక్కులా మాడవీధులు,సప్త గోపురాలు, కాకతీయుల సంప్రదాయాలను ప్రతిబింబించే కృష్ణశిలా శిల్పాల సోయగాలతో యాదాద్రి శోభాయమానంగా వెలిగిపోతోంది.

- Advertisement -