తెలంగాణలో కాంగ్రెస్‌ ఖాళీ:కేటీఆర్

269
ktr telangana bhavan
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్‌ నాయకులకు చలి జ్వరం పట్టుకుంటుందన్నారు.

కాంగ్రెస్‌తో ఏమీ కాదని ప్రజలకు అర్ధమైపోయిందన్న కేటీఆర్‌ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎందుకు గెలిపించాలో గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలన్నారు. ‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని ..టీఆర్‌ఎస్ సునామీకి పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు మట్టికరిచారన్నారు.

బీజేపీ,కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. మోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. రాహుల్‌గాంధీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ లాంటి పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ప్రధాని మోడీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -