కరెన్సీ నోట్ల మీద పిచ్చి రాతలు రాసేవాళ్లను చాలామందిని చూసి ఉంటాం. తమ పైత్యాన్ని చూపించడానికి ఎక్కడా చోటు దొరకనట్టు నోటు మీద రాసి మురిసిపోతుంటారు. కొంతమంది తమకు నచ్చిన హీరోలు,రాజకీయ నాయకులు,తమ ప్రేయసి పేర్లను రాసి పబ్లిసిటీ చేస్తుంటారు.వ్యాపారులు, బ్యాంకు సిబ్బంది పాత నోట్లను లెక్కపెట్టి ఖాళీగా ఉన్న ప్రదేశంలో నోట్ పై ఆ మొత్తాన్ని రాసేవారు. ఇంకా పేర్లు, గీతలు, గుర్తులు, కొందరు కోడ్ నెంబర్ లు కూడా దర్శనమిచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్నగీత గీసినా ఆ నోటు ఎందుకూ పనికి రాదని చెబుతున్నారు బ్యాంకర్లు.
ఇకపై కరెన్సీ నోట్లపై అలాంటి రాతలు చెల్లవు. రాతలే కాదు.. రాతలు రాసిన నోట్లు కూడా చెల్లవు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్ లో రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 500, 2000 నోట్లు విడుదల చేసింది. వాటిపై ఎలాంటి రాతలు రాసినా ఆ నోట్లు చెల్లవని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇప్పుడు భారతీయ స్టేట్ బ్యాంక్.. తమ ఖాతాదారులకు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేసింది.
పాత నోట్లపై అక్షరాలు, సంతకాలు ఉన్నప్పటికీ చెల్లుతాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కొత్త నోట్లపై అవి ఉంటే చెల్లవని, ఖాతాదారులు విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ సూచనల ప్రకారం పలు బ్యాంకుల ముందు ప్లెక్సీలు వెలుస్తున్నాయి. కొత్త నోట్లపై రాతలు రాయొద్దని.. అలా రాసిన నోట్లు చెల్లవని ప్రజలకు తెలిసేలా ప్రకటనలు వెలువడతున్నాయి.